ఇబ్రహీంపట్నం, వెలుగు: రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతలో నైజాం రాచరిక పాలనకు, దొరలు, భూస్వాములు, జమీందార్లు, జాగిర్దార్లు, పటేల్, పట్వారీ ఆకృత్యాలకు వ్యతిరేకంగా మట్టి మనుషులు సాగించిన మహత్తర సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు.
చరిత్రను వక్రీకరించి, మతాల మధ్య పోరాటంగా చిత్రీకరించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలు, రైతులకు పంపిణీ చేసిన ఘనత కమ్యూనిస్టులదేనన్న ఆయన.. చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరన్నారు. రంగారెడ్డి జిల్లాలో వీర తెలంగాణ సాయుధ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప పోరాటమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
